ధీర వనిత  - దైవశాంతి (Daiva shanthi)

సేకరణ /మూలం :ఈనాడు

ప్రపంచ రికార్డు.. వరసగా మూడోసారి..!
రాజపాళయం.. అసలు పేరు రాజుపాళెం. అవును! తెలుగు వూరే. ఎక్కువమంది తెలుగువాళ్లున్న ప్రాంతమే! కాకపోతే తమిళనాడులో ఉంటుంది. మదురై తెలుసుకదా.. అక్కడి నుంచి ఎనభై కిలోమీటర్ల దూరం. అలాంటి చిన్న టౌనులో పుట్టీ, పెరిగీ, అక్కడే ఉద్యోగం చేస్తున్న దైవశాంతి సైన్సులో ఇప్పుడో ప్రపంచ రికార్డు సాధించింది. ఎయిడ్స్‌, డెంగీ, స్వైన్‌ఫ్లూలాంటి వ్యాధులని సమర్థంగా ఎదుర్కోగల అతిచిన్న మందు కణాన్ని కనిపెట్టింది. లిమ్కా బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డుల్లోకెక్కింది! విశేషమేంటంటే.. ఈ పుస్తకంలో ఆమె స్థానం సాధించడం ఇది వరసగా మూడోసారి!
నాకు వూహ తెలిశాక అసలు నేను డిగ్రీ చదివితే గొప్ప అనుకునేదాన్ని! ఎందుకంటే మా ప్రాంతంలో అమ్మాయిలు ఆమాత్రం చదివితే చాలని పెళ్లి చేసేస్తారు. పైగా అమ్మ నన్ను ఒంటరిపోరాటం చేస్తూ పెంచింది. నాకు ఏడాది ఉన్నప్పుడే నాన్న చనిపోయారు. అమ్మ తపాలా కార్యాలయంలో అట్టడుగుస్థాయి ఉద్యోగినిగా ఉంటూ నన్ను చదివించింది. పదీ, పన్నెండో తరగతుల్లో ఎనభైశాతం కంటే ఎక్కువే మార్కులు తెచ్చుకున్నా. అప్పట్లో ఇంజినీరింగ్‌ చదవాలనుకునేదాన్ని. కానీ అమ్మ అంతంత డబ్బు పెట్టలేననడంతో బీఎస్సీ చేరా! మూడో ఏడాదిలో ఉన్నప్పుడే నేను పరిశోధనలవైపు వెళ్లాలని నిర్ణయించుకున్నా. బంధువులంతా నాకు పెళ్లి చెయ్యాలని ఒత్తిడి తెస్తే.. నిరాహారదీక్షచేసి మరీ ఎమ్మెస్సీలో చేరా. ఆ తర్వాత పీహెచ్‌డీ చేయాలనుకున్నా కానీ.. చెవి మెలిపెట్టి మరీ పెళ్లిపీటలెక్కించారు!
కాదు.. అదే ప్రారంభం! పెళ్లైన ఏడాదికే బాబు. మరోవైపు నాతోపాటూ చదువుకున్నవాళ్లంతా శాస్త్రవేత్తలుగా ఉద్యోగం సాధించి జర్మనీ, ఫ్రాన్స్‌ల్లో స్థిరపడుతుంటే.. నేనిలా ఉండిపోయానని బాధపడేదాన్ని. ఆ విషయం మా వారు గ్రహించారు. పీహెచ్‌డీ చేయమన్నారు. పరిశోధన దేనిపై చేయాలీ అని ఆలోచిస్తున్నప్పుడే మా ప్రొఫెసర్‌ ఒకాయన నానో-టెక్నాలజీ గురించి చెప్పారు! కొత్తగా ఉందే అని ‘లోహాల్లో నానో ఉపయోగాలు’ అనే అంశాన్ని తీసుకున్నాను. ఏదో చేరాను తప్ప దాని గురించి అప్పట్లో నాకేమీ తెలియదు. కానీ వెళ్లేకొద్దీ అదే నాకు ప్రపంచమైంది! మా ఆయన శంకరన్‌, సీఆర్‌పీఎఫ్‌ విభాగంలో ఫార్మసిస్టుగా కశ్మీర్‌లో చేస్తుండేవారు. ఆ చలిపడక తీవ్ర అస్వస్థతతో ఇంటికొచ్చేశారు. నేను ఉద్యోగం చేయకతప్పని పరిస్థితి! మొదట ఓ బడిలో, తర్వాత పాలిటెక్నిక్‌ కాలేజీలో లెక్చరర్‌గా చేరా. ఉద్యోగం, పరిశోధన రెండూ చేయడం కష్టంగానే ఉండేది. అయినా తప్పలేదు. దీనికి తోడు మరో పెద్ద సమస్య నాకు అడ్డునిలిచింది. అదే సొరియాసిస్‌!
బయటకు వెళ్లలేకపోయేదాన్ని.. ఎంతమంది వైద్యుల్ని కలిసి మందులు వాడినా తగ్గలేదు. ఎవరూ నా దగ్గరకొచ్చి నిల్చునేవాళ్లు కాదు! ఒక దశలో కాలు బయటకు పెట్టలేని పరిస్థితి. మా ఆయన ఫార్మసీ చేశారు కదా.. ఆయనా, నేనూ కలిసి సొరియాసిస్‌ని తగ్గించే వైద్యమూలికలకోసం వెతికాం. ఓ ఐదింటిని తీసుకున్నాం. వాటిని వివిధ పాళ్లలో కలుపుతూ నా మీద నేనే ప్రయోగాలు చేశాను. చివరకు ఓ ‘కాంబినేషన్‌’ బాగా పనిచేసింది. సొరియాసిస్‌ జోరు తగ్గింది. ఆ మందుకి సంబంధించి నానో కణాలు తయారుచేశా!! వాటిని మా ప్రొఫెసర్‌లకి చూపిస్తే వాటికి శాంతి పార్టికల్స్‌(కణాలు) అని నా పేరే పెట్టారు! ఈలోపు నా పరిశోధన పూర్తయి డాక్టరేట్‌ కూడా వచ్చింది. పరిశోధన చూసి కలశలింగం విశ్వవిద్యాలయం ఏకంగా అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌గానే అవకాశమిచ్చింది.
పసుపులోనూ ఉందహో..! ఇప్పటిదాకా ఇనుమూ, వెండి వంటి లోహాలకే అయస్కాంతధర్మం ఉందనుకునేవారు. మరి మొక్కలకీ ఉంటుందో లేదో నేను చూడాలనుకున్నాను. ఏడాదిపాటు పరిశోధించి పసుపూ, కొబ్బరి చిప్పల నానో కణాలకూ సూపర్‌ పారామాగ్నటిజమ్‌ గుణం ఉందని నిరూపించాను! 2015లో దానికే నా పేరు తొలిసారి లిమ్కా బుక్‌ ఆఫ్‌ రికార్డ్సులో నమోదైంది. దీనివల్ల సామాన్యులకేం లాభం అంటారా? క్యాన్సర్‌లో ‘హైపోథెర్మియా’ అనే అత్యాధునిక చికిత్స ఉంటుంది. దీనికి ఇంతదాకా రసాయనాలతో చేసిన మూలకాలే వాడుతున్నారు. వాటివల్ల దుష్ఫలితాలెక్కువ. అందుకు బదులు నానో ఔషధ మూలకాలనూ వాడొచ్చని.. నా పరిశోధన ద్వారా స్పష్టంచేశా. గత ఏడాది నా దృష్టి గ్రాఫిన్‌ లోహంపై పడింది. ప్రపంచంలోనే అతి పలచనైన, శక్తిమంతమైన లోహం ఇది! కట్టడాల నిర్మాణం, పెయింట్లూ, పెట్రోలియం ఉత్పత్తుల తయారీలో వాడతారు. కాకపోతే ఒక కిలో తయారుచేయడానికి రూ.70 వేలు అవుతుంది! దాన్నే నానో సాంకేతికత ద్వారా రూ.2 వేలకే అమ్మొచ్చని నిరూపించా! అమెరికాలోని బారియర్‌ వన్‌ ఇంటర్నేషనల్‌ అనే యాడ్‌-మిక్స్‌ సంస్థ నా దగ్గర్నుంచి నానో గ్రాఫిన్‌ను కొంటోంది!
ఈ ఏడాది.. మళ్లీ ఔషధ మూలకాలపై పరిశోధన చేయడం మొదలుపెట్టా. ముఖ్యంగా నేలవేముపై! ఇందులో యాంటీ-వైరల్‌ గుణాలేవైనా ఉన్నాయేమో చూడాలనుకున్నాను. ఉన్నాయి. దాన్నే అతి సూక్ష్మమైన నానోగా మార్చాను. అలా ప్రపంచంలోనే అతిసూక్ష్మమైన యాంటీవైరల్‌ కణం కనిపెట్టాను. దీనికే వరసగా మూడోసారి లిమ్కా బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డ్సులో స్థానం సంపాదించా. సాధారణంగా మనకు వైరస్‌ వల్ల వ్యాధి వస్తే తగ్గదు. మన శరీర కణాల్లో చేరిన వైరస్‌ తనకు రక్షణగా కొన్ని ఎంజైములు విడుదలచేస్తుంది. కానీ ఈ నానో మూలకం మన శరీరంలోని కణాలకంటే వెయ్యిరెట్లు చిన్నది. దాంతో వైరస్‌ సోకిన కణంలోకి సులభంగా వెళ్లిపోయి దాన్ని ప్రారంభంలోనే నాశనం చేస్తుంది! ఈ కణం ఎయిడ్స్‌, హెచ్‌1వీ1, డెంగీ వంటి వైరస్‌లని సమర్థంగా ఎదుర్కొంటుంది. వివేకానందుడు చికాగో వెళ్లి ప్రపంచానికి భారతీయత గురించి చెప్పాడని చదువుకోవడం నాకెంతో స్ఫూర్తినిచ్చింది. నేనూ అలా విదేశాలకు వెళ్లి మాట్లాడాలని కోరుకునేదాన్ని. ఆ కల నెరవేరింది. ఇప్పటిదాకా వివిధ దేశాల్లో డెబ్భైకి పైగా పరిశోధనలు గురించి మాట్లాడా!

SOURCE  LINK  : http://www.eenadu.net/vasundhara/vasundhara-inner.aspx?catfullstory=13725 

No comments: