అద్వైతమూర్తి - కరుణశ్రీ


అద్వైతమూర్తి
---కరుణశ్రీ---
చూచెదవేలనో ప్రణయ సుందరి, కాటుక కళ్ళలోని యా
లోచనలేమిటో హరిణ లోచని నీ చిరునవ్వులోని సం
కోచములెందుకో కుసుమ కోమలి నీ మధురాధరమ్ములో
దాచుకొనంగ నేటికి సుధామయ సూక్తి కళావిలాసినీ..
.
మనదాంపత్యము సత్యమౌ ప్రణయ సామ్రాజ్యమ్ములో లోతులన్
గనియెన్ సాగెను భాగ్యనౌక కవితా కాళిందిలో నవ్య జీ
వన బృందావన దివ్యసీమ విహరింపన్ రమ్ము నే కొల్ల గొం
దును నీ కోమల బాహు బంధనములందున్ కోటి స్వర్గమ్ములన్..
.
భావోద్యానమునందు కొత్త వలపుం పందిళ్ళలో కోరికల్
తీవెల్ సాగెను పూలు బూచెను రసాద్రీ భూత తేజమ్ముతో
నీవే నేనుగ నేనెనీవుగ లతాంగీ ఏకమై పోదమీ
ప్రావృణ్ణీ రద పంక్తి క్రింద పులకింపన్ పూర్వ పుణ్యావళుల్...

No comments: